Wednesday, March 23, 2016

కల్పన 2

                                                       

               ఆఫీసు లో పీడకలలు వస్తున్నాయని ఇక ఎప్పుడూ ఆఫీసు లో నిద్రపోనని మంగయ్య శపథం చేశాను. ఆరవగానే అర నిమిషం వ్యర్థం కాకుండా అరవై స్పీడ్లో అర గంటలో రూమ్ కి వచ్చేశాను. అప్పటికే రూమ్ లో మా రూమ్ మేట్ రవి ఎప్పుడొచ్చాడో, గురకపెడుతూ నిద్రపోతూ ఉన్నాడు. ఈరోజు కూడా నిన్నట్లాగే స్నానం చేద్దామని అనుకున్నాను ( నిన్న కూడా అలాగే అనుకున్నాను), కానీ ఓపిక లేక చెయ్యలేదు. మొహం కడుక్కొని వచ్చి T.V ముందు కూర్చున్నా.  'Yతెలుగు' ఛానల్ లో ఏదో ప్రోగ్రాం వస్తోంది, తెలుగు ముందు ఒక ఒక ఆంగ్ల అక్షరం ఉండడం వల్ల వెంటనే ఆ ఛానల్ మార్చేసి 'మీTV' పెట్టా, ఏదో మంచి ప్రోగ్రాం వస్తోంది. కానీ ఇంతకన్నా మంచి ప్రోగ్రాం ఏమైనా వస్తోందేమోనని అన్ని ఛానళ్ళు ఒకసారి వెతికా. అంతలో మరో రూమ్ మేట్ కిరణ్ వచ్చాడు. వచ్చిన వెంటనే నిద్రపోతున్న రవిని చూసి చిరాగ్గా మొహం పెట్టి నన్నిలా అడిగాడు.
కిరణ్:   వీడేంట్రా? ఎప్పుడొచ్చాడు? ఎప్పుడు పడుకున్నాడు? ఎప్పుడు లేస్తాడు?
పై ప్రశ్నలకు కింది జవాబులు ఇవ్వబడ్డాయి
వీడేంట్రా?   -  వాడంతే అదో టైపు
ఎప్పుడొచ్చాడు?  -  ఎప్పుడొస్తాడో వాడికే తెలియదు
ఎప్పుడు పడుకున్నాడు? -  ఎప్పుడు పడుకోడు?
ఎప్పుడు లేస్తాడు? - system can not find the value you are looking for
"ఈ రోజు వంట చెయ్యాల్సింది వీడే కదా! ప్రతిసారి భలే తప్పించుకుంటున్నాడు" అన్నాడు కిరణ్, తను కూడా మొహం కడుక్కుని నా పక్కన వచ్చి కూర్చున్నాడు. రిమోట్ తీసుకొని ఒకటి నుంచి నూట యాభై వరకు అన్ని భాషా ఛానళ్ళు ఆరోహణ, అవరోహణ క్రమంలో మార్చి చూశాడు. అదేంటో, సరిగ్గా వాడు మార్చే సమయంలో ఎందులోనూ  కార్యక్రమం రాకపోగా అన్నింటిలోను ఒకే ప్రకటన వివిధ భాషల్లో వస్తోంది. చిరాకు పడి రిమోట్ నాకిచ్చి వెల్లి laptop ముందు కూర్చున్నాడు. నేను ఇదంతా ఎందుకులే అని, పాత పాటల కోసం "మినీ లైఫ్" పెట్టా. కానీ అందులో వచ్చేవి కూడా "పాత" పాత పాటలే, "కొత్త" పాత పాటలేవీ రావట్లేదు. కొంత సేపటికి కిరణ్ మళ్లీ వచ్చాడు.
కిరణ్ : వీడిని నమ్ముకుంటే పస్తే, ఈరోజుకి మనమే వంట చేద్దాం.
నేను : సరే నేను అన్నం పెడతాను, నువ్వు కూర వండు.
కిరణ్ : లేదు, నేను అన్నం బాగా వండుతాను. నువ్వు కూర చేసేయ్.
నేను : సరే... కానీ,కానీ,కా.... నీ

అయిదు నిమిషాల్లో కుక్కర్లో అన్నం పెట్టి మళ్లీ వెళ్లి laptop ముందు కూర్చున్నాడు కిరణ్. ఇక నా వంతు, వెళ్లి చూస్తే ఒక్క గిన్నె కూడా కడగలేదు. ఒక గిన్నె నిండా పొద్దున రవి దోశలోకి చేసిన  సాంబారు ఉంది, పొద్దున లేట్ అయిందని మేమెవ్వరం తినకపోయేసరికి అది అలాగే ఉన్నట్టుంది. మళ్లీ వండడం ఎందుకు, దీంతోనే సరిపెడదాం అనుకున్నా. అంతలో రెండు బొద్దింకలు ఆడుకుంటూ,ఆడుకుంటూ నా వైపు వచ్చాయి. మన వంటకి ఏ వంకా పెట్టకుండా తినే ప్రాణుల్లో బొద్దింక ఒకటి (  ఇక్కడ రెండున్నాయ్). సాంబారుకీ,బొద్దింకకీ ఏదో అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి సాంబారులో బొద్దింకనేస్తే బాగోదని , బొద్దింకలకే కొద్దిగా సాంబారేశా. అవి భయపడి పారిపోయి, మళ్లీ వచ్చి ఆ సాంబారు చుక్కల్ని రెండు గుక్కలేసాయి. ఉన్నట్టుండి అవి ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టాయి, భక్తేమో అనుకున్నా. వాటిలో ఒకటి కష్టం మీద తల పైకెత్తి నాకేతో చెప్పడానికి ప్రయత్నించింది
బొద్దింక : ఇది దాగి ఉన్న బొధ్ధింకల మీద వాడేది కదా, స్వేచ్చగా బయట తిరుగుతున్న మా మీద ఏల  ప్రయోగించితివి?
నేను : అయ్యో! ఇది అది కాదు, ఇది మాకోసం మా రవి చేసింది.
బొద్దింక : అయితే దాన్ని దాచై లేదా నువ్వు దాక్కో
అని మమ్మల్ని కాపాడి అతి కష్టం మీద అవి రెండు తమ రహస్య స్థావరం వైపు వెళ్తుంటే చూసి నాకే జాలేసింది. ఆ సాంబారు బయట పారేస్తే ఇంకేదైనా జీవి దాని బారిన పడుతుందేమోనని సింక్ లో పారాబోశా.
             ఉన్న కురగాయన్నింటిని రెండు రెండు చొప్పున కోసి, తగిన మోతాదులో ఉప్పు,చింతపండు,పసుపు,కారం, గరం మసాల,చికెన్ మసాల,సాంబారు పొడి, రసం పొడి వగైరా.. వేసి అయిదు మందికి సరిపడా నీళ్ళు పోసి ( అవి ఉడికి,ఇనికి ముగ్గురికి సరిపడా అవుతుందని), మళ్లీ T.V దగ్గరకొచ్చా.
                " నమస్కారం, '_tv ' వార్తలకి  స్వాగతం, ముందుగా ముఖ్యాంశాలు
  - ప్రపంచ శాంతి దినోత్సవం సంబరాల్లో భాగంగా క్షిపణులను ప్రయోగించిన పలు దేశాలు
  - పెట్రోలు, డీజల్ లపై రెండు రూపాయలు పెంచి, రూపాయి తగ్గింపు
  - సిగ్నల్ కోసం సెల్ టవర్ ఎక్కిన  శేషాచలం, ఆత్మహత్య చేసుకుంటాడేమోనని అనుమానించి అరెస్ట్ చేసిన        పోలీసులు.
 -  ఎన్నికల ప్రచారంలో భాగంగా మాటల్లోనే కాకుండా, చేతల్లో కూడా ఒకరిపై ఒకరు బురద చల్లుకున్న నేతలు
 -  " ఎంత బరువైనా ఎత్త గలిగిన నాకు సంసార భారం మోయడం పెద్ద విషయం కాదు" అని ట్వీట్ చేసిన వెయిట్ లిఫ్టర్ బ్రహ్మచారి భార్గవ్.
      దీనికి స్పందిస్తూ అతని తండ్రి స్విమ్మర్ సాగర్ " పిచ్చినాకొడుకా! సంసార సాగరాన్ని ఈదడం నా వల్లే కావట్లేదు, నువ్వెంత ?" అని రిప్లై ఇచ్చాడు.
 - 'భోనీ' సేన మంచి బోణి తో సిరీస్ శుభారంభం.
చివర్లో నేను ఎదురు చూస్తున్న వాతావరణ వార్తలు వచ్చాయి. మా ప్రాంతంలో ఉష్ణోగ్రత గరిష్ఠం 43°C, కనిష్ఠం 43°C
నమోదు అయిందట, నిజమే మరి అసలు తేడా తెలియట్లేదు. కానీ రానున్న 24 గంటల్లో జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పింది. కిటికీ తీసి చూశా ఒక్క చుక్క లేదు, ఆకాశంలో చుక్కలు స్పష్టంగా కనపడుతున్నాయి. గురక పెడుతున్న మా రవి గాన్ని చూశా, నిజమే! అదిగో "జల్లు" కురవట్లేదు, కారుస్తున్నాడు. రానున్న 24 గంటల్లో ఇంకెంత కారుస్తాడో! .
          కాసేపటికి  "అన్నం, కూర రెడీ!"  అన్నాను, అప్పటిదాకా నిద్రపోతున్నవాడు ఒక్క ఉదుటున లేచి "నేనూ రెడీ " అన్నాడు.  

No comments:

Post a Comment