Wednesday, March 23, 2016

కల్పన 2

                                                       

               ఆఫీసు లో పీడకలలు వస్తున్నాయని ఇక ఎప్పుడూ ఆఫీసు లో నిద్రపోనని మంగయ్య శపథం చేశాను. ఆరవగానే అర నిమిషం వ్యర్థం కాకుండా అరవై స్పీడ్లో అర గంటలో రూమ్ కి వచ్చేశాను. అప్పటికే రూమ్ లో మా రూమ్ మేట్ రవి ఎప్పుడొచ్చాడో, గురకపెడుతూ నిద్రపోతూ ఉన్నాడు. ఈరోజు కూడా నిన్నట్లాగే స్నానం చేద్దామని అనుకున్నాను ( నిన్న కూడా అలాగే అనుకున్నాను), కానీ ఓపిక లేక చెయ్యలేదు. మొహం కడుక్కొని వచ్చి T.V ముందు కూర్చున్నా.  'Yతెలుగు' ఛానల్ లో ఏదో ప్రోగ్రాం వస్తోంది, తెలుగు ముందు ఒక ఒక ఆంగ్ల అక్షరం ఉండడం వల్ల వెంటనే ఆ ఛానల్ మార్చేసి 'మీTV' పెట్టా, ఏదో మంచి ప్రోగ్రాం వస్తోంది. కానీ ఇంతకన్నా మంచి ప్రోగ్రాం ఏమైనా వస్తోందేమోనని అన్ని ఛానళ్ళు ఒకసారి వెతికా. అంతలో మరో రూమ్ మేట్ కిరణ్ వచ్చాడు. వచ్చిన వెంటనే నిద్రపోతున్న రవిని చూసి చిరాగ్గా మొహం పెట్టి నన్నిలా అడిగాడు.
కిరణ్:   వీడేంట్రా? ఎప్పుడొచ్చాడు? ఎప్పుడు పడుకున్నాడు? ఎప్పుడు లేస్తాడు?
పై ప్రశ్నలకు కింది జవాబులు ఇవ్వబడ్డాయి
వీడేంట్రా?   -  వాడంతే అదో టైపు
ఎప్పుడొచ్చాడు?  -  ఎప్పుడొస్తాడో వాడికే తెలియదు
ఎప్పుడు పడుకున్నాడు? -  ఎప్పుడు పడుకోడు?
ఎప్పుడు లేస్తాడు? - system can not find the value you are looking for
"ఈ రోజు వంట చెయ్యాల్సింది వీడే కదా! ప్రతిసారి భలే తప్పించుకుంటున్నాడు" అన్నాడు కిరణ్, తను కూడా మొహం కడుక్కుని నా పక్కన వచ్చి కూర్చున్నాడు. రిమోట్ తీసుకొని ఒకటి నుంచి నూట యాభై వరకు అన్ని భాషా ఛానళ్ళు ఆరోహణ, అవరోహణ క్రమంలో మార్చి చూశాడు. అదేంటో, సరిగ్గా వాడు మార్చే సమయంలో ఎందులోనూ  కార్యక్రమం రాకపోగా అన్నింటిలోను ఒకే ప్రకటన వివిధ భాషల్లో వస్తోంది. చిరాకు పడి రిమోట్ నాకిచ్చి వెల్లి laptop ముందు కూర్చున్నాడు. నేను ఇదంతా ఎందుకులే అని, పాత పాటల కోసం "మినీ లైఫ్" పెట్టా. కానీ అందులో వచ్చేవి కూడా "పాత" పాత పాటలే, "కొత్త" పాత పాటలేవీ రావట్లేదు. కొంత సేపటికి కిరణ్ మళ్లీ వచ్చాడు.
కిరణ్ : వీడిని నమ్ముకుంటే పస్తే, ఈరోజుకి మనమే వంట చేద్దాం.
నేను : సరే నేను అన్నం పెడతాను, నువ్వు కూర వండు.
కిరణ్ : లేదు, నేను అన్నం బాగా వండుతాను. నువ్వు కూర చేసేయ్.
నేను : సరే... కానీ,కానీ,కా.... నీ

అయిదు నిమిషాల్లో కుక్కర్లో అన్నం పెట్టి మళ్లీ వెళ్లి laptop ముందు కూర్చున్నాడు కిరణ్. ఇక నా వంతు, వెళ్లి చూస్తే ఒక్క గిన్నె కూడా కడగలేదు. ఒక గిన్నె నిండా పొద్దున రవి దోశలోకి చేసిన  సాంబారు ఉంది, పొద్దున లేట్ అయిందని మేమెవ్వరం తినకపోయేసరికి అది అలాగే ఉన్నట్టుంది. మళ్లీ వండడం ఎందుకు, దీంతోనే సరిపెడదాం అనుకున్నా. అంతలో రెండు బొద్దింకలు ఆడుకుంటూ,ఆడుకుంటూ నా వైపు వచ్చాయి. మన వంటకి ఏ వంకా పెట్టకుండా తినే ప్రాణుల్లో బొద్దింక ఒకటి (  ఇక్కడ రెండున్నాయ్). సాంబారుకీ,బొద్దింకకీ ఏదో అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి సాంబారులో బొద్దింకనేస్తే బాగోదని , బొద్దింకలకే కొద్దిగా సాంబారేశా. అవి భయపడి పారిపోయి, మళ్లీ వచ్చి ఆ సాంబారు చుక్కల్ని రెండు గుక్కలేసాయి. ఉన్నట్టుండి అవి ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టాయి, భక్తేమో అనుకున్నా. వాటిలో ఒకటి కష్టం మీద తల పైకెత్తి నాకేతో చెప్పడానికి ప్రయత్నించింది
బొద్దింక : ఇది దాగి ఉన్న బొధ్ధింకల మీద వాడేది కదా, స్వేచ్చగా బయట తిరుగుతున్న మా మీద ఏల  ప్రయోగించితివి?
నేను : అయ్యో! ఇది అది కాదు, ఇది మాకోసం మా రవి చేసింది.
బొద్దింక : అయితే దాన్ని దాచై లేదా నువ్వు దాక్కో
అని మమ్మల్ని కాపాడి అతి కష్టం మీద అవి రెండు తమ రహస్య స్థావరం వైపు వెళ్తుంటే చూసి నాకే జాలేసింది. ఆ సాంబారు బయట పారేస్తే ఇంకేదైనా జీవి దాని బారిన పడుతుందేమోనని సింక్ లో పారాబోశా.
             ఉన్న కురగాయన్నింటిని రెండు రెండు చొప్పున కోసి, తగిన మోతాదులో ఉప్పు,చింతపండు,పసుపు,కారం, గరం మసాల,చికెన్ మసాల,సాంబారు పొడి, రసం పొడి వగైరా.. వేసి అయిదు మందికి సరిపడా నీళ్ళు పోసి ( అవి ఉడికి,ఇనికి ముగ్గురికి సరిపడా అవుతుందని), మళ్లీ T.V దగ్గరకొచ్చా.
                " నమస్కారం, '_tv ' వార్తలకి  స్వాగతం, ముందుగా ముఖ్యాంశాలు
  - ప్రపంచ శాంతి దినోత్సవం సంబరాల్లో భాగంగా క్షిపణులను ప్రయోగించిన పలు దేశాలు
  - పెట్రోలు, డీజల్ లపై రెండు రూపాయలు పెంచి, రూపాయి తగ్గింపు
  - సిగ్నల్ కోసం సెల్ టవర్ ఎక్కిన  శేషాచలం, ఆత్మహత్య చేసుకుంటాడేమోనని అనుమానించి అరెస్ట్ చేసిన        పోలీసులు.
 -  ఎన్నికల ప్రచారంలో భాగంగా మాటల్లోనే కాకుండా, చేతల్లో కూడా ఒకరిపై ఒకరు బురద చల్లుకున్న నేతలు
 -  " ఎంత బరువైనా ఎత్త గలిగిన నాకు సంసార భారం మోయడం పెద్ద విషయం కాదు" అని ట్వీట్ చేసిన వెయిట్ లిఫ్టర్ బ్రహ్మచారి భార్గవ్.
      దీనికి స్పందిస్తూ అతని తండ్రి స్విమ్మర్ సాగర్ " పిచ్చినాకొడుకా! సంసార సాగరాన్ని ఈదడం నా వల్లే కావట్లేదు, నువ్వెంత ?" అని రిప్లై ఇచ్చాడు.
 - 'భోనీ' సేన మంచి బోణి తో సిరీస్ శుభారంభం.
చివర్లో నేను ఎదురు చూస్తున్న వాతావరణ వార్తలు వచ్చాయి. మా ప్రాంతంలో ఉష్ణోగ్రత గరిష్ఠం 43°C, కనిష్ఠం 43°C
నమోదు అయిందట, నిజమే మరి అసలు తేడా తెలియట్లేదు. కానీ రానున్న 24 గంటల్లో జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పింది. కిటికీ తీసి చూశా ఒక్క చుక్క లేదు, ఆకాశంలో చుక్కలు స్పష్టంగా కనపడుతున్నాయి. గురక పెడుతున్న మా రవి గాన్ని చూశా, నిజమే! అదిగో "జల్లు" కురవట్లేదు, కారుస్తున్నాడు. రానున్న 24 గంటల్లో ఇంకెంత కారుస్తాడో! .
          కాసేపటికి  "అన్నం, కూర రెడీ!"  అన్నాను, అప్పటిదాకా నిద్రపోతున్నవాడు ఒక్క ఉదుటున లేచి "నేనూ రెడీ " అన్నాడు.  

Thursday, March 17, 2016

కల్పన

                                                                              

నాకు ఇంటి దగ్గర కూడా అంత నిద్ర పట్టదు,  కానీ ఆఫీసు కి వస్తే మాత్రం  నిద్రాదేవి ఆవహిస్తుంది. బహుశా ఆమె కూడా మా ఆఫీసు లోనే కనిపించకుండా పనిచేస్తుందేమో అని నా అనుమానం. ఆ రోజు గురువారం మధ్యాహ్నం  బాగా తిని వచ్చి కూర్చున్నా, అప్పటికే టైం 1.30 అయింది. నిద్రాదేవి నా కనురెప్పలపై  నాట్యం చేయడం మొదలుపెట్టింది , నా కళ్ళపై  మోయలేనంత బరువుపడుతోంది. అది రాహు కాలం అవడం వల్ల రెండు సార్లు వెళ్లి మొహం కడుక్కొని వచ్చా (చెడ్డ కలలు వస్తాయేమోనని). అంతలో టైం మూడైంది, "దేవీ ! నేను సిద్దం" అన్నాను, వెనకనుంచి ఎవరో నా కళ్ళు మూసారు.  ఇంకెవరు అది ఆమే! (ఆఫీసు లో పిలిచిన వెంటనే వస్తుంది పాపం), వచ్చి హిప్నాటిజం మొదలు పెట్టింది నా మీద.   
           కలలో కళ్ళు తెరిచి చూసే సరికి ఒక అందమైన రాజభవనం, నేను రాజ సింహాసనానికి పక్కనే కూర్చుని ఉన్నాను.  సభలో మా ఆఫీసు  వాళ్ళు ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు. ఇది నా కలే కదా కనుక నేనే రాజునై ఉంటాను అనుకొని వెళ్లి సింహాసనంలో కూర్చోబోతూ ఉండగా ఎవరో నా మీద చేయి వేశారు తిరిగి చూస్తే అది మా మానేజరు, ఆశ్చర్య పోయి ఉన్న నన్ను పక్కకు నెడుతూ ఇలా అన్నాడు " మహా మంత్రీ! మేము రావడం కాస్త ఆలస్యమైతే మీరు మా  స్థానాన్నే ఆక్రమించేలా ఉన్నారే!". ఆయన మాటలు నాకు వినపడ్డాయి కానీ అవాక్కయున్న నాలో  ఎన్నో ప్రశ్నలు మెదిలాయి "అసలు ఇది నా కలేనా? లేక అయన కలలో నేనున్నానా? రాహు కాలం దాటాకే కదా పడుకున్నాను? నా కలలో కూడా నాకు స్వేచ్ఛ లేదా ? నా కలలో కూడా నేను రాజును కాదా? పండగ పూట కూడా పాత చింతకాయ పచ్చడేనా? ఈ దిక్కుమాలిన కల నుంచి  ఎలా బయటపడాలి ?" అని మనసులో అనుకుంటూ ఉండగానే ఏదో అశరీరవాణి యిలా పలికింది "భ్రమ రాతను ఎవరూ తప్పించలేరు " ( నిజ జీవితంలో బ్రహ్మరాత, కలలో భ్రమ రాతే మరి). చేసేదేమీ లేక కనీసం మంత్రి పదవైనా ఇచ్చాడని  కలని మళ్లీ resume చేశాను, "లేదు మా"రాజా" సింహాసనానికి మట్టయ్యుంటే తుడిసానంతే" అని నా ఆసనానికి వచ్చి కూర్చున్నా. టీం లీడ్ లు వచ్చి ఆయనకు వింజామరులు  విసర సాగారు.
            "మేము వచ్చు దారిలో మా మదిలో ఒక వింత ఊహ మెదిలింది దానిని మీరు పూరించ గలరని మా విశ్వాసం" అంటూ రాజు ఏదో ఆలోచిస్తూ పాడబోతున్నట్టుగా ముఖం పెట్టాడు. సంస్కృత, తెలుగు,తమిళ లేదా ఇంగ్లీషు లాంగ్వేజ్ లో అడుగుతడేమో  అనుకున్నా కానీ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఒక  పద్యం పాడాడు. అన్నీ అచ్చు తప్పులే ( అదే సింటాక్స్ తప్పులు ). అంతటితో ఆగలేదు చివరగా 'అ'కారాన్ని అరగంట సేపు ఆలాపన చేశాడు. అదంతా చూసి " IT IS A CRIME, I WANT TO SCREAM IN MY DREAM" అని గట్టిగా అరవాలనిపించింది కానీ అరవలేకపోయా. ఇక సమస్యని పూరించండి అన్నట్టుగా ఆయన తల ఆడించాడు, మా ఆఫీసు వాళ్ళు,  వాళ్ళు ముప్పై రోజుల్లో నేర్చుకున్నరక రకాల ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లలో  పద్యాలు పాడారు. కానీ వాళ్ళుకూడా 'ఇ' కారం మొదలు 'ఒ' కారం వరకు తలా ఒక కారాన్ని ఆలపించారు. వారి సమాధానం రాజుకి రుచించినట్టు లేదు, నేను మంత్రిని కదా నన్ను అడగడేమో అనుకున్నా . కానీ నన్నూ వదల్లేదు. జావా ఎప్పుడో పూర్తిగా తిరగేసిన నేను వాజా లో పద్యం పాడి సమస్యను పూరించా  (నిజానికి పూరించలేదు, ఆ సింటాక్స్ తప్పులు తీసేసానంతే). మచ్చుకైనా నన్ను మెచ్చుకోని మా మానేజరు ఒక్క సారిగా "అద్భుతం" అన్నాడు. ఆ ఆనందంలో నేను కూడా ఆలాపన చేద్దామని వాళ్ళు మిగిల్చిన 'ఔ'కారాని కి శ్రీకారం చుట్టా కానీ ఆ 'ఔ'కారం పై స్థాయిలో పాడితే నక్క అరుపు లాగా, కింది స్థాయిలో కుక్క ములూగుడు లాగా (దయచేసి ఇంటి వద్ద ప్రయత్నిచకండి) అనిపించి నాకే వికారం కలిగి ఆపేసా.
             ఇంతలో భటుడు వచ్చి "మహారాజా! మీ తీర్పు కొరకు ఎవరో వచ్చియున్నారు "అన్నాడు . "ప్రవేశ పెట్టండి". తీరా చూస్తే అది ఇద్దరు తల్లులు ఒక బిడ్డ కథ. ఆ కథ అందరికీ తెలిసిందే అయినా రాజు ఇంకోసారి మొత్తం సావధానంగా  విన్నాడు. విని తన ముఖాన్ని గంభీరంగా పెట్టి "ధర్మాన్ని తీసుకు రండి" అని ఆదేశించాడు. భటులు ఒక ఆవును తీసుకొచ్చారు అదే తోలుకొచ్చారు. "మా పూర్వీకులు మాతో "ధర్మం ఎప్పుడూ నాలుగు పాదాల మీద నడవాల"ని, అది ఎంత ప్రయత్నించినా తమ వల్ల సాధ్య పడలేదని అంటుండేవారు, కనుక మేము యుక్తితో ఈ ఆవు కి ధర్మం అని పేరు పెట్టాం. ఇప్పుడు ధర్మం మన రాజ్యంలో నాలుగు పాదాలమీదే నడుస్తోంది". ఇదంతా చూశాక ఇంతవరకు ఈయన టాలెంట్ బయట పడలేదే అనుకున్న నాకు ఇప్పుడిప్పుడే కల  నచ్చడం మొదలయింది. ఎలాగో అదే తీర్పు చెప్తాడు కదా అనుకున్నా కానీ  ఇలా అర్ధం చేసుకుంటాడ ని అనుకోలేదు "తన మీద  హత్యా నేరం మోపబడుతుందేమో అని భయపడి పిల్లవాణ్ణి ఆమెకే ఇచ్చేయమన్నఈమె వంచకురాలు, ఆమె మాతృమూర్తి" అని తీర్పు మొత్తం మార్చి చెప్పాడు. పర్వాలేదులే కలే కదా అని వదిలేశా. అంతలోపే అలసినట్టున్నాడు "కాసేపు విరామం" అన్నాడు. సభ అంతా ఖాళీ అయినా నాకు  కలలో ఎక్కడికి వెళ్ళాలో తెలియక అక్కడే మా మానేజరు,టీం లీడ్ ల తో పాటు ఉండిపోయాను. ఎండా కాలం కదా బాగా చమట పట్టినట్టుంది, కిరీటం పక్కన పెట్టి తన నున్నటి తలని ఒక నున్నటి గుడ్డ తో తుడుచుకున్నాడు. టీం లీడ్ లు వింజామరులు కొంచెం వేగంగా విసరసాగారు. వాళ్లు ఆయనికి ఒక ముంతనిచ్చారు, రాజు నా వైపు చూసి " మంత్రి వర్యా! మీరూ సురాపానం కానివ్వండి" అని అన్నాడు. నేను మిగతా వాళ్ళతో వెళ్లుంటే సరిపోయి ఉండేది "లేదు మహారాజా ఆ 'సారాపానం' మీరే కానివ్వండి" అని ఏదో ఆలోచిస్తూ అనేశా. రాజు కళ్ళు ఎర్ర బడ్డాయి, ఇప్పుడు నాకు చెమటలు బట్టాయి. పాపం మా లీడ్ నా మీద జాలిపడి కాసేపు వింజమరం నాకు విసిరాడు, ఆ చమటకి "చల్లగా" అనిపించి "చల్లగా ఉండు" అని దీవించా. అంతలో అందరూ ఆపద్భాందవుల లాగా తిరిగి వచ్చేశారు,                                                  తర్వాత ఏమిటా అని  అనుకుంటూ ఉండగానే బాక్గ్రౌండ్ లో "ఆకాశవాణి! కార్యక్రమంలో తరువాత రాబోతున్నది 'మధురై నుంచి మధురగాయకుడు చిరంజీవి మధు 'మధురానగరిలో ... 'అనే పాటకు, కన్యా కుమారి నుంచి వచ్చిన కుమారి కన్య ఆట'". ఆ మధురగాయకుడు షార్ట్ గా 'మధుగాడు'  శృతి,లయ (మా colleagues) కొంచెం దూరంగా అటూ,ఇటూ కూర్చొని ఉండడం వల్ల కాబోలు  తన పాటలో వాళ్ళు లేకుండా జాగ్రత్త పడ్డాడు. ఆ నర్తకి తన గజ్జెల శబ్దం వినపడుతుందేమో అని బయపడ్డంటుంది ఉన్నచోటునుంచి కదలకుండా కేవలం చేతులు ఆడిస్తూ సైగ చేస్తున్నట్టుగా చేస్తోంది.అతగాడు పాట చదివిన దానికి ఈమె సైగలకి అది మూగావార్తల్ని తలపించింది.
క్లైమాక్స్ ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉండగా భటుడు వేగంగా సభలోకి "మహారాజా! మహారాజా!" అంటూ వచ్చాడు. "ఏం జరిగింది?" అని రాజు అడిగాడు. "శత్రురాజ్యం వాళ్లు మనపైకి దండయాత్ర కి వస్తున్నారని కబురు వచ్చింది మహారాజా".  రాజు భయంతో నా వైపు తిరిగి "తక్షణ కర్తవ్యం ఏమిటో మీరే మాకు సెలవియ్యాలి మంత్రి వర్యా!" అని అడిగాడు. ఆయన ఆ పదం నా దగ్గర అనడం వల్ల కాబోలు వెంటనే ఆలోచించకుండా ఇలా అనేశా " శత్రువులు దండయాత్రకు వచ్చే సమయంలో మీరిలా శెలవు అడగడం ఏమీ బాగలేదు". ఈసారి ఆయన కళ్ళు ఎర్రబడ్డమే కాదు, పళ్ళు కూడా కొరుకుతున్నాడు నన్ను చూసి, నేను నాలుక కరుచుకున్నా, తల పట్టుకున్నా, గుటకలు మింగా, నిట్టూర్పు విడిచా అయినా అయన చూపు మారలేదు. సర్లే రాజు అడిగినదానికైనా చెపుదామని ఇలా అన్నాను " శత్రువులు మన రాజ్యానికి వచ్చేలోపు మనం మూట,ముల్లి సర్దుకొని పిల్లా,జల్ల తో వేరే దారిన వారి రాజ్యానికి వెళ్దాం, తరువాత రాజి పడి ఎవరి రాజ్యానికి వాళ్ళు వచ్చేదాం,అంతే". రాజుకి కోపం కట్టలు తెంచుకుంది "ఒరేయ్ ! " అని గట్టిగా  అరిచే సరికి నాకు మెలకువొచ్చింది, ఎదురుగా నిజంగానే మా"రాజు" ఉన్నాడు. "రేపు రెస్ట్ తీసుకోవాలని leave అడిగి ఈరోజు ఆఫీసు లోనే రెస్ట్ తీసుకుంటున్నావా? నీ leave రిజెక్ట్ చేస్తున్నా పో!" అని వెళ్ళిపోయాడు, పాపం నిద్రాదేవి ఇవన్నీ పట్టించుకోకుండా మళ్లీ వచ్చింది.