Friday, April 8, 2016

'పద్మ'వ్యూహం

       గత ఆరు వారాలుగా(సోమ,మంగళ ... శని) ఎదురు చుసిన ఆదివారం రానే వచ్చింది . రంగారావు T.V చూస్తూ ఉన్నాడు, అతని భార్య శాంత వంటింట్లో ఉంది. ఛానళ్ళు మారుస్తూ ఉండగా ఒక లోకల్ ఛానల్ వచ్చేసరికి ఎందుకో తెలియదు కానీ రిమోట్ పని చెయ్యడం మానేసింది, " సేల్! సేల్! గ్రాండ్ సేల్! కంచి పట్టు, హస్తకళా పట్టు, సాముద్రిక పట్టు, రా వచ్చి పెట్టుబడి పెట్టు... " అనే ప్రకటన వస్తోంది, ఎంత ప్రయత్నించినా రంగారావు  వాల్యూం కూడా తగ్గించలేకపోయాడు. ఎప్పుడొచ్చిందో తెలియదు కానీ శాంత తన వెనకే ఉండి అదంతా చూసి " ఏవండీ! మనం కూడా ఒక పట్టు పడదామండీ!" అంటూ ఎంతో ప్రేమగా తన చేతికి శనగ పిండి ఉందని మర్చిపోయి అతని తల నిమర సాగింది. ఇంతలో రిమోట్ మళ్లీ పని చేస్తోంది. "అనుకున్నదంతా అయింది" అని మనసులో అనుకుంటూనే 'ఒక పట్టు' అని ఏకవచనం వాడడం వల్ల కాబోలు, ఏ కవచం లేకుండా అజాగ్రత్తతో యుద్దానికి వెల్లినట్టు, ఆలోచించకుండా " సరే! చూద్దాంలే!" అన్నాడు. శాంత ఆ మాటకు నానార్ధాలు, ప్రతిపదార్థాలు
వెతికి " సరే! చూద్దాం లెయ్" అన్నట్టుగా అర్ధం చేసుకుంది. అదే అర్ధాన్ని భర్తకి చెప్పింది ఆ అర్ధాంగి
రావు : అది కాదే నా ఉద్దేశం....
శాంత : నాకు తెలుసు మీది ఎప్పుడూ సదుద్దేశమే
రావు : అవును నాది సదుద్దేశం, నీదెప్పుడూ సద్దే ఉద్దేశం

కొన్నిసార్లు ఓడిపోవడమే గెలవడం అని అనుభవజ్ఞుడైన రావుకి బాగా తెలుసు, కనుక "సరే!" అన్నాడు.
                   తాము వెళ్ళాల్సిన బస్స్టాండ్ దగ్గర దిగి అందరూ వెళ్ళడం చూసి, తను కూడా భార్యను తీసుకుని అటువైపు వెళ్ళాడు. ఆ వీధి పేరు "పద్మ వ్యూహం" , దాని కింద కాప్షన్ "ఇక్కడ ఇసకేస్తే రాలదు" అని రాసి ఉంది. పద్మ వ్యూహం అన్న హెచ్చరిక లాంటి పేరుని రంగారావు పెద్ద పట్టించుకోలేదు, కానీ ఆ ఇసకేస్తే రాలదు అనేది ఏదైనా గమ్మత్తైన ఆటేమోనని వెళ్తూ వెళ్తూ బయటే సగం బస్తా ఇసక కొనుక్కుని సంకలో పెట్టుకుని వెళ్ళాడు. కొద్ది దూరం వెళ్ళగానే అతని వేగం క్రమంగా తగ్గిపోసాగింది, చిన్నప్పుడు ఆడిన అడుగులో అడుగాట గుర్తొచ్చింది రంగారావుకి. కాసేపటికి జాన లో జాన, వేలులో వేలు ఆటగా మారింది. " ఈ కిక్కిరిసిన జనాభాలో కుక్క కరిసినా దిక్కులేదు "( ఉరికే ప్రాస కోసం వాడా) అనుకున్నాడు.

రంగారావు : శాంతా! ఇప్పటికైనా మించి పోయిందేమి లేదు, ఇంతకు మించి పోతేనే ఏమవుతుందో! వెనక్కెళ్ళి పోదామా?
శాంత : ఇంత దూరం వచ్చింది వెనక్కెల్లే దానికా? కాసేపు ఓపిక పట్టండి, అలవాటై పోతుంది.

                చేసేదేమీ లేక ఆ ఇసకాటైన అడుకుందామని ఇసక పైకి విసరసాగాడు, ఆ ఇసక రాలిందో లేదో కింద నేల కనపడితే కదా తెలిసేది. ఆ సామెతకి అర్ధం అప్పుడు తెలిసింది రంగారావుకి, ఇసక అంతా అందరి నెత్తిన చల్లేసి ఆ గోతాన్ని కూడా గాల్లోకి విసిరేసాడు, అదేదో పండగ ఆఫర్ గా షాప్ కి వెళ్ళకుండానే ఇచ్చారనుకొని దాన్ని లాక్కొని,పీక్కొని తలో ముక్క తీసుకున్నారు. "అసలు సిగ్నలే లేని చోట గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు పడుతుందా అని  ఎదురు చూసినట్టు వీళ్ళు ఎందుకిలా వెళ్తున్నారో ?" అని మనసులో అనుకున్నాడు.

                   కొద్ది దూరం వెళ్లాక జనాభా తగ్గి, కాస్త గట్టిగా ఊపిరి తీసుకున్నారిద్దరూ, వాళ్ళు వెళ్ళాలనుకున్న షాప్ వచ్చింది, కానీ అక్కడ అన్ని షాప్ ల దగ్గరా ఆఫర్లు పెట్టున్నాయి. రంగారావుకి ఎడమ కన్ను అదర సాగింది. " నేను లోపలికి రాను నువ్వే వెళ్లి సెలెక్ట్ చేసి తీసుకో" అని చెప్పి క్రెడిట్ కార్డు శాంతకి ఇస్తూ, ఎంత ఖర్చు పెట్టాలో చెప్పేలోపు ఆమె లోపలికెల్లిపోయింది.  ఈ లోపు అక్కడుండే వాళ్ళతో మాట్లాడి రంగారావు తమిళ, మలయాళ, కన్నడ భాషల మీద మంచి పట్టు సంపాదించాడు. ఇంతలో అతనికి మూడంకెల సంఖ్యలో క్రెడిట్ కార్డు వాడినట్టు బిల్లు   మెసేజ్ వచ్చింది, కాసేపటికి ఆమె కూడా వచ్చింది. భార్య చేసిన పొదుపుని మెచ్చుకుంటూ ఆమెని మలయాళంలో మెచ్చుకున్నాడు. "అది కాదండీ! అక్కడ పెద్దగా వెరైటీలు లేవు, ఆ పక్క షాప్లో ట్రై చేస్తాను" అని చెప్పి "బోతీస్" లోకి వెళ్లింది. అదంతా చూసి " ఇంతలో ఎంత అపార్దం చేసుకున్నాను" అనుకున్నాడు మనసులో.  ఈసారి  రంగారావు అన్ని మత గ్రంధాలను కంఠస్థం చేశాడు, అతని ముఖం ఎంతో ప్రశాంతంగా వెలిగిపోతున్న సమయంలో మళ్లీ మెసేజ్ వచ్చింది, అయిదంకెల సంఖ్యలో ఉందా బిల్లు.  రంగారావు ముఖంలో రంగులు మారాయి, అతను ఇంతవరకు చదివినవి,నేర్చుకున్నవి ఏవీ అతనికి ఇప్పుడు గుర్తులేవు. ఆమె రాగానే, ఏది మరిచినా మాతృభాష తెలుగు మరవలేదు కనుక ఆమెను తెలుగులో తిట్టాడు ( అదే ప్రయత్నించాడు). "నేనేమీ నా ఒక్క దానికే కొనలేదు, మీకు కూడా బోతీస్ లో రెందు దోతీస్ తీసుకున్నాను. పైగా అన్నీ కొన్నందుకు ఆఫర్ గా ఇది కూడా ఇచ్చాడు" అంటూ తన చేతిలో ఉన్న సంచిని చూపించింది. " అయిదంకెల సంఖ్యలో బిల్లు కడితే రెండు కర్రలుండే సంచి గిఫ్ట్ గా ఇచ్చాడా?" అనుకొని, మనశ్శాంతి కోసం గుర్తు రాకపోయినా మళ్లీ ఆ మత గ్రంధాలన్నీ తాను నెమరు వేసుకొని భార్యకు కూడా చెప్పాడు రంగారావు. ఇదంతా విన్న శాంత "ఇప్పుడిప్పుడే నా కళ్ళు తెరుచుకుంటున్నాయండి" అంటూ పక్కనే ఉన్న కళ్ళద్దాల షాప్ వైపు చూస్తూ చెప్పింది. "నీలో ఈ మార్పు రాకుండా ఉన్నా బావున్ను" అనుకుంటూ, తుఫాను హెచ్చరికలాగా, యుద్ధ ప్రాతిపదికన ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా అక్కడ నుంచి బయట పడాలనుకున్నాడు రంగారావు.
          భార్యని తీసుకుని అక్కడ నుంచి వేగంగా వెళ్తూ ఉన్న రంగారావుకి చాలాసేపటికి తను దారి తప్పాడని అర్ధమైంది, ఎటు వైపు చుసినా షాపులే, పైగా అన్నిటికీ ఆఫర్లు. ఎవరినైనా అడుగుదామా అంటే అందరూ గమ్యం తెలియని బాటసారులలాగే కనపడ్డారు. అంతలో ఒక చెట్టు కింద ఉన్న స్వామీజి తననే పిలుస్తున్నట్టుగా అనిపించి ఆయన దగ్గరకి వెళ్ళాడు. స్వామీజి శాంతని కొంచెం దూరంగా ఉండమని రావుని మాత్రం దగ్గరకు పిలిచాడు.
రావు ఏదో అడగబోతుండగా " నాయనా! నీవు  ఏమి వెతుకుతున్నవో నాకు తెలుసు. అదుగో అటు చూడు " అంటూ ఒక విగ్రహాన్ని చూపించాడు, "ఆ విగ్రహం చూపుడు వేలు చూపిస్తున్న దిశగా వెళ్ళు, అటువంటివి ఆరు ఉంటాయి. కానీ జాగ్రత్త సుమా! ఎక్కడా ఆగకు, ఏమీ వినకు, వెనక్కి తిరిగి చూడకు" . రావుకి ఆ  విగ్రహంలో స్వామిజి పోలికలు కనిపించి అడగాలనుకునేలోపు " నా కర్ధమైంది, నేను త్రికాల జ్ఞానిని. ఆ విగ్రహం నాదే, స్వయానా నేనే చేసి, ప్రతిష్టించా. నా భార్య పేరు పద్మ.  నేను సతీ సమేతంగా ముల్లోకాలు చుడుతూ మిగతా లోకాలన్నీ పూర్తి చేసి, భూలోకంలో చివరగా ఈ వీధికి వచ్చాం. ఏదో కొంటానని వెళ్లిన ఆమె కోసం నేనింకా సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నాను, ఇంతకాలం ఇక్కడకి వచ్చిన నీ లాంటి వాళ్ళకి దారి చూపిస్తున్నాను( అదే నా విగ్రహాన్ని చూపిస్తున్నాను) " అని స్వామీజి అన్నాడు.
రావు : అంటే స్వామీజీ! 'పద్మ'వ్యూహం అంటే ...?
స్వామీజి: అవును, నీ అనుమానం నిజమే.
రావు : అంటే మీ పేరు...
స్వామీజి : అదే, నువ్వనుకున్నదే...